నవంబరు 15, 2006...4:27 పూర్వాహ్నం

సాంధ్యశ్రీ …

Jump to Comments

అంజన రేఖ వాల్కనుల యంచులదాటి మనోజ్ఞ మల్లికా
కుంజములో సుధా మధుర కోమల గీతిక లాలపించు ఓ
కంజ దళాక్షి, నీ ప్రణయ గానములో పులకింతునా మనో
రంజని బుష్పవృష్టి పయి రాల్పి నినున్ బులకింప జేతునా

క్రొంజిగురాకు వేళుల కురుల్ తడియార్పుచు గూరుచున్న య
భ్యంజన మంగళాంగి జడలల్లుదునా, మకరంద మాధురీ
మంజుల మామక ప్రణయ మానస భావనలే ప్రపుల్ల పు
ష్పాంజలి జేసి నీ యడుగులందు సమర్పణ జేసికొందునా

సంజ వెలుంగులో పసిడి చాయల ఖద్దరు చీర గట్టి నా
రింజకు నీరు వోయు శశిరేఖవె నీవు సుభద్ర సూతినై
రంజిత పాణి పల్లవము రాయుదునా నిను మౌళి దాల్చి మృ
త్యుంజయ మూర్తినై జమునితో తొడ గొట్టి సవాలు చేతునా

ప్రత్యుత్తరమిమ్ము